రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలి: జిల్లా న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలని, ఫలితంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు నెలకొన్న సందర్భాలలో ఈ రికార్డులే కీలకమవుతాయని ఎస్.శశిధర్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, పాన్ ఇండియా సంయుక్త న్యాయ అవగాహన కార్యక్రమంలో బాగంగా శనివారం చిట్కుల్ మహేశ్వర మెడికల్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు చోటు చేసుకుంటుందని, అందరికీ న్యాయం అందే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గతంలో బాల్యవివాహాలు విరివిగా జరిగేవని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి డిజిటలైజేషన్ పథకాల వల్ల మైనార్టీ తీరకుండా ఎవరు వివాహాలు చేయడం లేదన్నారు. పింఛన్ల వల్ల ఆయా కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం నెలకొందని, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందేలా కృషి చేస్తుందని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ముహూర్తాలు పెట్టి సిజేరియన్ లు చేయమనే సంస్కృతి పెరిగిందని దీన్ని డాక్టర్లు ప్రోత్సహించవద్దన్నారు. జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ రోగుల విషయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్మాణ రంగ కార్మిక లబ్దిదారులకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు, మహిళలకు ఆసరా పింఛన్లను అతిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు హనుమంతరావు, ఆర్డీఓ నాగేష్, మహేశ్వర మెడికల్ కళాశాల డైరెక్టర్ కృష్ణారావు, డీన్ సవిత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *