మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డారం గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని అంతిమంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతి త్వరలోనే గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో పార్టీ పట్టిష్టతకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కార్యకర్తలకు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఇస్నాపూర్ మున్సిపల్ పాలకమండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పటాన్చెరు మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మోటె సుమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, రాములు గౌడ్, మోటె కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
