_అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి..
_కలవడం కలవడమే కొట్లాట కొట్లాటే
_దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు..
_కేసిఆర్ ఆశీర్వాదంతోనే మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాం..
_పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ వెంటే నడుస్తామనికేసిఆర్ ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించామని.. నమ్ముకున్న ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లైనా కలుస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం హైదరాబాదులోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహచర శాసనసభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో..మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజల నమ్మకంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగిందని తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం కల్పిద్దామని అధికారం కట్టబెట్టారని ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో మంజూరైన జీవోల అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందే తప్ప.. ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన విస్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లైనా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేదని తెలిపారు.సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో పోరాటాలకు సైతం సిద్ధమని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను కలిశారని అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము ముఖ్యమంత్రి కలిశామని ఈ అంశంపై రాజకీయ దుష్ప్రచారం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.రాజకీయ వైరుధ్యాలు ఉంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని కలవడం తప్పా అని ప్రశ్నించారు.కాకమ్మ కబుర్లు చెబుతూ అధికార కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లదీస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తెలిపారు.సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.