_7 కోట్ల 48 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )
ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండలం పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ముత్తంగి, పాశమైలారం, లక్డారం, చిట్కుల్ గ్రామాలలో 7 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాల్లు, మన ఊరి మనబడి పథకం పనులు, బ్రిడ్జిల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.పెద్దకంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 30 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
ఇటీవల మృతి చెందిన చిన్న కంజర్ల గ్రామానికి చెందిన రైతు గౌస్ ఖాన్ కుటుంబానికి రైతు బీమా ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును మృతుడి కుటుంబానికి ఆయన అందజేశారు.ముత్తంగి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడు మత్స్యకార సహకార సంఘాలకు ఆరు లక్షల 50వేల చేప పిల్లలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి గల్లీలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పచ్చదనం పెంపొందించేలా నర్సరీలు, మిషన్ భగీర ద్వారా రక్షిత మంచినీరు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజాప్రతిని ద్వారా ఇప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.ఒకే రోజు 7 గ్రామాల్లో ఏడుకోట్ల 50 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులోను తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రజాప్రతినిదుల భాగ్యస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్నారు.చేప పిల్లల పంపిణీలో అలసత్వం వహించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పంపిణీ చేపట్టాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు.
పటాన్చెరు నియోజకవర్గం లోని 55 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరి మనబడి పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం శ్రీకారం చుట్టిందని అన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.