పటాన్ చెరు
పుట్టిన బిడ్డ నుండి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని .పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పటాన్ చెరు మండలానికి చెందిన నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా .పటాన్ చెరు మండలానికి నూతనంగా మంజూరైన 757 రేషన్ కార్డులు, ఒక కోటి 12 లక్షల రూపాయల విలువైన 112 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధికంగా పటాన్ చెరు నియోజకవర్గానికి 2222 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు అయ్యేలా చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ ఆగస్టు 1వ తేదీ నుండి బియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
ప్రభుత్వ పథకాల అమలులో వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఆర్డిఓ నగేష్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్ పి టి సి సుప్రజా వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ కమిటీల చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు