కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు

Districts Hyderabad politics Telangana

అమీన్ పూర్

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం చేపట్టిన కూల్చివేతలో అధికారులు అతి ఉత్సాహం చూపారని కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆరోపించారు. గురువారం అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరిట ఆర్డీవో నగేష్ ఆధ్వర్యంలో చేపట్టిన కూల్చివేతలో అధికారులు పక్షపాతం చూపారని తెలిపారు. అయినా వాళ్లకు ఒక న్యాయం ఎదుటి వారికి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చెందిన కట్టడాలను నేలమట్టం చేసి, ఇతరులవి నామమాత్రంగా కూల్చడం ఎవరి మెప్పు కోసమని మండిపడ్డారు.

వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను, ఎఫ్టిఎల్, డీఆర్ఓ కస్టడీలోని భూములను ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఆదిలోనే అడ్డుకోని నిజాయితీ నిరూపించుకోవాలని, పత్రాలు ఉన్నా కనీసం నోటీసులు, సమయం ఇవ్వకుండా కట్టడాలను కూల్చివేయడం సమంజసం కాదన్నారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎంపీపీగా ఉన్నప్పుడు శంభుని కుంటలో అక్రమాలు అంటూ లొల్లి పెట్టి, ఇప్పుడు తన అనుచరులు, పార్టీ నేతలే నిర్మాణాలు చేపడితే మౌనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై గతంలొనే తాము ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకొని మున్సిపల్ కమిషనర్ అనుమతులు లేకుండా, అక్రమ అనుమతులతో ఐదు అంతస్తులు నిర్మించినా కళ్లు మూసుకుంటుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, పక్షపాత వైఖరి మానుకోవాలని కోరారు.

అక్రమ నిర్మాణాలను అరికడితే తాము అభినందిస్తామని, పక్షపాతం చూపితే మాత్రం సహించమని కాట శ్రీనివాస్ గౌడ్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, మండల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు లావణ్య శశిధర్, సునీత, పద్మావతి గోపి, మున్నా, నాయకులు శ్రీనివాస్, సుధాకర్, రవీందర్, ప్రకాష్, మన్నె రవీందర్, సత్యనారాయణ, శంకర్, మహేష్, సిద్దు, రాములు గౌడ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *