పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని పి.ఎల్.మాధురి డాక్టరేట్ కు అర్హత సాధించారు. గోధుమ గడ్డి ఆకులను సహజ క్షయకరణ, క్యాపింగ్ ఏజెంట్ గా ఉపయోగించి మెటల్ ఆక్సైడ్ నానోకంపోజిట్లను సంశ్లేషణ ద్వారా నీటి కాలుష్య నివారణకు పర్యావరణ అనుకూల విధానాన్ని అన్వేషించడంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఫణి రాజా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ మాధురి చేసిన అత్యుత్తమ పరిశోధన స్థిరమైన శాస్త్రం, పర్యావరణ కాలుష్య నివారణకు గణనీయమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. ఈ పర్యావరణ అనుకూల పద్ధతి ఫోటోకాటలిటిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో జింక్ ఆక్సైడ్-కార్బన్, కాపర్ ఆక్సైడ్, మాగ్నెటైట్-కార్బన్, నికెల్ ఆక్సైడ్ వంటి నానోకంపోజిట్లను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. నీటి శుద్ధి కోసం తక్కువ వ్యయంతో కూడిన, సమర్థవంతమైన నానోమెటీరియల్స్ అభివృద్ధి చేయడానికి సేంద్రీయ వ్యవసాయ వ్యర్థాలను ఎలా సమర్థంగా ఉపయోగించవచ్చో ఈ అధ్యయనం వెల్లడిస్తుందన్నారు.డాక్టర్ మాధురి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.పరివర్తనాత్మక విద్యా ప్రయత్నాల ద్వారా పరిశోధన నైపుణ్యం, ఆవిష్కరణలను పెంపొందించే లక్ష్యంతో గీతం ముందుకు సాగుతోందని తెలియజేశారు.