కల్నల్ రమేష్ సరియాల్ నేతృత్వంలో
మే 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డిలోని 33 (తెలంగాణ) బెటాలియన్ ఎన్ సీసీ క్యాడెట్ల కోసం సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ-III) మే 26 నుంచి జూన్ 4, 2025 వరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (రుద్రారం) ప్రాంగణంలో నిర్వహించనున్నారు. పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో దాదాపు 600 మంది క్యాడెట్లకు తర్ఫీదు ఇస్తారు. సమిష్టి జీవనం, సమగ్ర అభివృద్ధికి ఈ శిబిరం విలువైన అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. నాయకత్వం, క్రమశిక్షణ, జట్టు కృషి, వ్యక్తిత్వ నిర్మాణం, జాతీయ సమైక్యత యొక్క బలమైన భావాన్ని పెంపొందించడానికి ఈ శిబిరాన్ని జాగ్రత్తగా రూపొందించారు.క్యాడెట్ల లో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించడం, క్రమశిక్షణ, సహకారం, వ్యక్తిత్వ నిర్మాణాలను ప్రోత్సహించడం, సామాజిక సేవ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇందులో భాగంగా డ్రిల్, ఆయుధ శిక్షణ, కాల్పులలో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు సాహస కార్యకలాపాలు, శారీరక దారుఢ్యం వైపు క్యాడెట్లను ప్రేరేపిస్తారు. ఎన్ సీసీ బీ, సీ సర్టిఫికేట్ పరీక్షలకు క్యాడెట్లను సిద్ధం చేయడం, థల్ సైనిక్ క్యాంపు (టీఎస్సీ-2025), గణతంత్ర దినోత్సవ పెరేడ్ (ఆర్డీసీ-2026) వంటి ప్రతిష్టాత్మక శిబిరాలకు తగిన అభ్యర్థులను గుర్తించి శిక్షణ ఇవ్వనున్నారు.
అలాగే సాయుధ దళాలలో అవకాశాల గురించి అవగాహన కల్పించడం, అగ్నివీర్, ఇతర సైనిక ప్రవేశ పథకాల ద్వారా కెరీరలను ఎంపిక చేసుకునేలా ప్రేరేపిస్తారు. బాధ్యతాయుతమైన పౌరులుగా నడుచుకునేలా క్యాడెట్ల వ్యక్తిత్వాన్ని రూపొందిస్తారు.అనుభవజ్జులైన ఎన్ సీసీ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాత్మక, తీవ్ర శిక్షణ నిర్వహించనున్నారు. తొలి రోజు క్యాంపు ఏర్పాటు, పత్రాల పరిశీలన, ఈ పదిరోజులలో చేపట్టే కార్యక్రమాలపై దిశా నిర్ధేశం చేస్తారు. శారీరక శిక్షణతో (పీటీ) ప్రారంభమయ్యే రెండు రోజు రోల్ కాల్స్ తో ముగియనుంది. ఈ శిక్షణ శిబిరాన్ని 33వ బెటాలియన్ ఎన్ సీసీ కమాండింగ్ ఆఫీసర్, క్యాంపు కమాండెంట్ కల్నల్ రమేష్ సరియాల్ మే 27న ఉదయం 9 గంటలకు అధికారికంగా ప్రారంభిస్తారు.క్యాడెట్లలో సృజనాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడలతో పాటు డ్రిల్, క్రాస్ కంట్రీ ఈవెంట్లను నిర్వహించనున్నారు.
కల్నల్ రమేష్ నేతృత్వంలో నిర్వహించే ఈ క్యాంపులో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్-అకౌంట్స్ అధికారిగా కెప్టెన్ పి.విజయ, క్యాంప్ శిక్షణ అధికారిగా లెఫ్టినెంట్ ఆర్.మహేందర్ రెడ్డి, క్యాంప్ అడ్జటెంట్ గా లెఫ్టినెంట్ యాదగిరి వ్యవహరించనుండగా, గీతం తరఫున ఎన్ సీసీ కేర్ టేకింగ్ ఆఫీసర్ ఎస్.అజయ్ కుమార్ పాల్గొననున్నారు.క్యాంపులో ఉన్న తమ పిల్లలను చూడాలనుకునే తల్లిదండ్రులకు సాయంత్రం 6.00 నుంచి 6.30 వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టీకరించారు. క్యాంపు జరిగినన్ని రోజులు క్యాడెట్లకు అవసరమైన వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని, అయితే ఎటువంటి సెలవు మంజూరు చేయబోమన్నారు. ఈ శిక్షణా శిబిరం ఒక సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తుందని, దేశానికి సేవ చేయడానికి, బాధ్యతాయుతమైన పౌరులుగా, భవిష్యత్తు నాయకులుగా ఎదిగేందుకు క్యాడెట్లను శారీరక, మానసిక, నైతిక బలాలతో సన్నద్ధం చేస్తుందని అభిలషిస్తున్నారు.