ఆసక్తిగల ఈనెల 11వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవచ్చు – వక్తలుగా ప్రముఖ అధ్యాపకులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)లు, జనరేటివ్ ఏఐ’ అనే అంశంపై ఈనెల 13-14 తేదీలలో జాతీయ వర్క్ షాప్ను నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే వారికి ఆ రెండు అంశాలపై పరివర్తనాత్మక ప్రపంచంలో బలమైన పునాదిని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఎల్ఎల్ఎంలు, జనరేటివ్ ఏఐ పద్ధతులను అమలు చేయడంలో వారి నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు కార్యశాల నిర్వాహకులు డాక్టర్ మోతాహర్ రెజా, డాక్టర్ బీ.ఎం.నాయుడు తెలియజేశారు. ఎల్ఎల్ఎం, జనరేటివ్ ఏఐల పరిచయం, ఏఐలో నీతి, సవాళ్లు, రియల్-వరల్డ్ అప్లికేషన్లు, కేస్ స్టడీస్ వంటి అనేక కీలకమైన అంశాలను ఈ రెండు రోజుల కార్యక్రమంలో విశదీకరిస్తామన్నారు.
ఇందులో పాల్గొనే వారు వివిధ డొమైన్ లలో ట్రాన్స్ ఫార్మర్ ఆర్కిటెక్చర్ లు, జనరేటివ్ టెక్ట్స్ మోడళ్లు, మల్టీమోడల్ ఏఐ అప్లికేషన్ లతో సహా ఏఐలో అత్యాధునిక పురోగతులను అన్వేషించే అవకాశాన్ని కూడా పొందుతారని తెలిపారు.ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన గౌరవనీయమైన రీసోర్స్ పర్సన్ లు ఆయా సెషన్ లకు నాయకత్వం వహిస్తారని, వారిలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిబా ఉదగత, కోల్ కతా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్ అన్సుమన్ బెనర్జీ, ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ అనిమేష్ ముఖర్జీ, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ మౌనేంద్ర శంకర్ దేశర్కర్, బెంగళూరులోని శామ్ సంగ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ ప్రవీణ్ ఉన్నట్టు వారు పేర్కొన్నారు.ఈ వర్క్ షాపులో విద్యావేత్తలు, పరిశోధక విద్యార్థులు, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ స్థాయి విద్యార్థులు పాల్గొనవచ్చని, వారు ఏఐ, డేటా సైన్స్ రంగాలలో సమగ్ర జ్జానం, ఆచరణాత్మక అనుభవం, విలువైన పరిశ్రమ అంతర్దృష్టులు, నెట్ వర్కింగ్ అవకాశాలు, ఈ రంగంలో భవిష్య పురోగతికి సంసిద్ధతను పొందవచ్చన్నారు.
ఆసక్తి గలవారు ఈనెల 11వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, ఇతరత్రా వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ కె. కృష్ణ 99080 85343 లేదా డాక్టర్ డి. మల్లికార్జనరెడ్డి 98493 17334 లను సంప్రదించవచ్చని లేదా dkummari@gitam.edu / mdoodipa@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని నిర్వాహకులు సూచించారు.