పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
భవిష్యత్తులో మరో వెయ్యి మంది పూర్ణ (పర్వతారోహకు)లను సృష్టించాలనేది తన లక్ష్యమని, తనకు మద్దతునిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనేదే తన ఆకాంక్ష అని ఎవరెస్ట్ పర్వతారోహకురాలు, ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించి, ప్రస్తుతం ట్రాన్స్ సెంట్ పర్వతారోహక శిక్షణ సంస్థ (టార్క్) డెరైక్టర్ పూర్ణ మాలావత్ చెప్పారు. ‘అమృతకాల్ విమర్శ్ వికాసిత్ భారత్-2024’ ప్రసంగ సరంపరలో భాగంగా, ‘విభిన్న అభివృద్ధి కార్యక్రమాలపై క్రీడల ప్రభావం, భారత విధానాలు’ అనే అంశంపై బుధవారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు . యువతను, మరీ ముఖ్యంగా మహిళలు, బాలికలు, వారి కలలను సాధించడానికి ప్రోత్సహించాలనే తన ప్రగాఢ వాంఛను ఆమె వ్యక్తపరిచారు. స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉండడం, ఎప్పటికీ వెన్నుమాపకపోవడం, సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్పిచెప్పారు.
పూర్ణ తన తల్లిదండ్రులు, గురువు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, శిక్షకుడు శేఖర్ బాబు తదితరులు తన ప్రయాణంలో ఇచ్చిన మద్దతు, మార్గదర్శనాలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి చర్చించే అవకాశం కల్పించిన గీతమ్ కు కృతజ్ఞతలు తెలిపిన పూర్ణ, అక్కడున్న విద్యార్థులకు వారి లక్ష్యాలను సాధించడంలో సహనం, పట్టుదలల ప్రాముఖ్యను నొక్కిచెబుతూ, పెద్ద కలలు కనాలని, కష్టపడి పనిచేయాలని, సరెనై ప్రణాళికతో ముందుకు సాగాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా, సరికొండ మండలం, పాకాల గ్రామానికి చెందిన పూర్ణ అతి పిన్న వయస్సులోనే (13 సంవత్సరాల నాలుగు నెలలు) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అంతర్జాతీయ గుర్తింపు పొందడమే గాక, 2022లో ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఫోర్బ్స్ ఇండియా- 2020 స్వీయ-నిర్మిత మహిళల జాబితాలో చోటు దక్కించుకోవడమే గాక, ఆమె అద్భుత ప్రయాణంపై ‘పూర్ణ; కరేజ్ హాస్ నో లిమిట్’ (ఫెర్ట్యానికి పరిమితి లేదు) పేరిట చలన చిత్రం, ‘పూర్ణ’ పేరుతో ఆపర్ణ తోట ఆమె జీవిత చరిత్రను రచించిన విషయం విదితమే. పూర్ణ మనోధైర్యం , దృఢ సంకల్పాల నుంచి గీతం విద్యార్థులు, అధ్యాపకులు ప్రేరణ పొందారు. ఆమె సాధికారత సందేశం ప్రాంగణం లోపల, వెలుపల ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.