ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్న మోడీ

politics Telangana

_తాము అధికారంలోకి వస్తే అన్నిటినీ కాపాడుతాం – రాహుల్ గాంధీ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రoలో ఉన్న తెరాస పార్టీలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీహెచ్ఈఎల్ తో పాటు ఇతర పరిశ్రమలను కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ముత్తoగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలన్నింటిని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాలోకి‌ ప్రవేశించింది. పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంటరీ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో బీహెచ్ఈఎల్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు.

మొదటి రోజు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీహెచ్ఈఎల్ సర్కిల్ వద్ద జిల్లా లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి మాజీ డిప్యూటీ సీఎం‌ దామోదర రాజనర్సింహా, కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్,‌ కాట సుధాశ్రీనివాస్ గౌడ్, తూర్పు నిర్మలా రెడ్డి ఘన స్వాగతం పలికారు. బీహెచ్ఈఎల్ సర్కిల్ వద్ద నుంచి రాహుల్ జోడో యాత్ర రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయం వరకు 22 కిలోమీటర్ల మేర కొనసాగింది. బీహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరు వరకు నడిచిన రాహుల్ పటాన్ చెరులోని ఆనంద్ హోటల్ లో టీ తాగారు. రామచంద్రాపురం – ఇక్రిశాట్ మధ్య ప్రధాన రహదారిపై చిన్నారులతో క్రికెట్ ఆడగా రాహుల్ గాంధీ బౌలింగ్ చేశారు. పటాన్ చెరులో పాఠశాల విద్యార్థులు జై జోడో యాత్ర,‌ జై రాహుల్ అంటూ నినాదాలు చేస్తూ పటాన్ చెరులో రాహుల్ గాంధీకి స్వాగతం పలకగా వారికి అభివాదం చేశారు. పటాన్ చెరు ఔటర్ రింగు రోడ్డు మీద వాహనాలు ఆపి పై నుంచే రాహుల్ జీ అంటూ నినాదాలు చేశారు. ఓఆర్ఆర్ మీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాహుల్ గాంధీని వెంబడిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జై రేవంతన్న, జై కాట శ్రీనన్న, జై గాలి అనిల్ కుమార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వీట్ హార్ట్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతు తెలిపారు. జోడో‌ యాత్రలో ఎలాంటి ఘటనలు‌ జరగకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం, సైబరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా సమస్యలను రాహుల్ జీ కి చెప్తాం – గాలి అనిల్ కుమార్, మెదక్ పార్లమెంటరీ ఇంచార్జీ రాహుల్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి వచ్చిన నేపథ్యంలో మొదటి రోజు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉంది. బీహెచ్ఈఎల్ సర్కిల్ నుంచి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాదయాత్ర చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది జిల్లాలో నెలకొన్న సమస్యలను రాహుల్ గాంధీకి చెప్తామని గాలి అనిల్ కుమార్ తెలిపారు. జోడో యాత్రలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు – కాట శ్రీనివాస్ గౌడ్, పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ పటాన్ చెరు నియోజకవర్గం లో మొదటి రోజు చేపట్టిన రాహుల్ గాంధీ జోడో యాత్రకు అశేష జనవాహిని రావడం సంతోషకరం. ఒక్క‌ పిలుపుతో స్వచ్ఛందంగా జోడో యాత్రకు వచ్చిన పటాన్‌చెరు నియోజకవర్గం ప్రజలందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *