పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. కేవలం 27 ఏళ్ల వయస్సులో తనకున్న పరిమిత వనరులతో ఆంగ్లేయుల సైన్యాన్ని గడగడలాడించి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపిన మహోన్నత విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి బతికినన్ని రోజులు స్వతంత్ర భారతావని కోసం పరితపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
