అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Districts Telangana

ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
85 లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

అమీన్పూర్

నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మధుర నగర్, భరత్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జయలక్ష్మీ నగర్ లో 85 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తో పాటు ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక పాలకవర్గాల తో పాటు కాలనీ సంక్షేమ సంఘాలు సైతం ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు శాఖతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణ తో పాటు కీలకమైన కేసుల చేధన లో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, వీటి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.

మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 24 వార్డుల పరిధిలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ భీమ్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విస్తీర్ణ పరంగా అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న అమీన్పూర్ పరిధిలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

మధుర నగర్, భరత్ నగర్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సోదరుడు నందారం రమేష్ గౌడ్ లను ఎమ్మెల్యే జిఎంఆర్, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సిఐ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *