పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రాబోయే వర్షాకాలంలో అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యవసర సహాయక బృందాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయం ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు 24 గంటల పాటు సహాయక బృందాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీటి కాలువలు, నాళాలు పొంగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో ఒక్కో బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.