నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంగళవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సంబంధిత శాఖ అధికారులను, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. గత జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, నాటినుండి నేటి వరకు శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. ఆసియాలోని అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికులకు అత్యాధునిక వైద్య సేవ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :