నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

Telangana

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో

జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఒక దేశం యొక్క నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ నిలుస్తోందని జాతీయ భౌతిక ప్రయోగశాల (CSIR–NPL) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ చెప్పారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘క్వాంటం టెక్నాలజీలకు క్వాంటం మెట్రాలజీ, మెట్రాలజీ’ అనే అంశంపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. విస్తరిస్తున్న క్వాంటం టెక్నాలజీల అభివృద్ధిలో ఖచ్చితత్వ కొలత యొక్క కీలక పాత్ర, ఈ సాంకేతికతల భవిష్యత్తులో అందివచ్చే విస్తారమైన ఉపాధి అవకాశాలను డాక్టర్ వేణుగోపాల్ వివరించారు. భారతదేశంలో క్వాంటం టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని ఆయన స్పష్టీకరించారు.

జాతీయ భౌతిక ప్రయోగశాల, దాని జాతీయ బాధ్యతలు, క్షిపణుల నుంచి అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాల వరకు ఈ సంస్థ సహకారంపై సమగ్ర అవలోకనాన్ని అందించారు. అకౌస్టిక్ గ్యాస్ థర్మోమెట్రీ, సీఎస్-ఫౌంటెన్ అటామిక్ క్లాక్, భారత ప్రామాణిక సమయం (ఐఎస్ టీ) యొక్క నిరంతర నిర్వహణతో సహా ఎన్ పీఎల్ లోని అత్యాధునిక సౌకర్యాలను కూడా ఆయన వివరించారు.
జాతీయ మెట్రాలజీ సంస్థల ప్రపంచ నెట్ వర్కు గురించి చెబుతూ, శాస్త్రీయ, సాంకేతిక పురోగతికి గుర్తించదగిన, అధిక ఖచ్చితత్వ కొలతలు అవసరమని చెప్పారు. భవిష్యత్తు మెట్రోలజీ వినియోగంలో నానోఫోటోనిక్స్ యొక్క ప్రాముఖ్యత, వీటి మూలాలు, వాటిని కనిపెట్టే పరికరాల కోసం సింగిల్-ఫోటాన్ మెట్రాలజీ, లేబుల్-ఫ్రీ సింగిల్-మాలిక్యూల్ డిటెక్షన్, ఇంటిగ్రేటెడ్ క్వాంటం సర్క్యూట్ల కోసం SiN & LNOI ప్లాట్ ఫారమ్ ల సామర్థ్యాన్ని పెంచడం అవశ్యమని ఆయన పేర్కొన్నారు.

తొలుత, గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బీ.వీ.ఆర్. టాటా వక్తను పరిచయం చేయగా, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వం తదితరులు అతిథిని సత్కరించారు. ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరై, సందేహాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *