గీతం అధ్యాపకులకు సూచించిన మానసిక ఆరోగ్య శిక్షకుడు రాహుల్ మండల్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ధ్యానం, శారీరక వ్యాయామం, సామాజిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు జీవన సమతుల్యతను కొనసాగించాలని.. తద్వారా సానుకూల దృక్సథంతో ముందుకు సాగిపోవచ్చని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మానసిక ఆరోగ్య శిక్షకుడు రాహుల్ మండల్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెంటార్లకు ‘అవగాహన ద్వారా సాధికారత – మానసిక ఆరోగ్య ప్రథమ చికిత్స శిక్షణ’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.మానసిక ఆరోగ్యంపై అవగాహనను కల్పిస్తూనే, దాని బహుముఖ స్వభావాన్ని రాహుల్ ఆవిష్కరించారు. ఇది మన మనస్సు యొక్క కలయికగా ఆయన అభివర్ణిస్తూ, ఇందులో ఆలోచనలు, భావాలు, సామాజిక స్వభావాలు ఉంటాయన్నారు. ఇంటెలిజెన్స్ కోషెంట్ (ఐక్యూ), ఎమోషనల్ కోషెంట్ (ఈక్యూ), సోషల్ కోషెంట్ (ఎస్ క్యూ)ల గురించి వివరిస్తూ, వర్తమాన సమాజంలో ఈక్యూ, ఎస్ క్యూలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఎత్తచూపారు. ఈ ప్రేమ్ వర్క్ ల ప్రకారం మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలని చెప్పారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సవాళ్లను గుర్తించడానికి, ప్రతిస్పందించడానికి తగిన నైపుణ్యాలు సమకూర్చుకునేలా అధ్యాపకులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా రాహుల్ ఉపన్యసించారు. మానసిక కుంగుబాటుకు సంబంధించిన సంకేతాలు, లక్షణాలను గుర్తించడంలో అధ్యాపకులు అప్రమత్తంగా ఉండాలని, తగిన విధంగా స్పందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. గీతం ప్రాంగణం లోపల, వెలుపల ఉన్న సహాయక సేవలను విద్యార్థులకు ఎలా సూచించాలో తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.శారీరక, విద్యా, ప్రవర్తన, భద్రత, అత్యవసర సంకేతాలతో సహా విద్యార్థి బాధపడుతున్నట్టు సూచించే కీలక సూచికలను రాహుల్ మండల్ వివరించారు.
అధ్యాపకుల కోసం ఆయన ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను అందించారు. విద్యార్థులతో కలగలుపుగా ఉండాలని, ముందే ఓ అభిప్రాయానికి వచ్చినట్టు కాకుండా సంభాషణలను ప్రారంభించాలని, స్వీయ-హాని లేదా ఆత్మహత్య ప్రమాదాన్ని అంచనా వేయాలని, అవసరమైనప్పుడు వృత్తిపరమైన సాయం పొందాలని విద్యార్థులను ప్రోత్సహించాలని అధ్యాపకులకు సూచించారు.ఆచరణాత్మక వ్యూహాలతో పాటు, విద్యార్థులు, అధ్యాపకులు.. ఇద్దరికీ స్వీయ-సంరక్షణ, క్షేమం అభ్యాసాల ప్రాముఖ్యతను కూడా రాహుల్ వివరించారు.