పటాన్ చెరు:
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా రూపాంతరం చెందిన నేటి పరిస్థితుల్లో ఎండీఆర్ ఫౌండేషన్ మానవతా కోణంలో సేవ చేస్తోంది. మరణించిన తరువాత దగ్గరి వారు కూడా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకునే రోజులివి. కానీ పటాన్ చెరు కేంద్రంగా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నఎండీఆర్ ఫౌండేషన్ మాత్రం అనాధలకు అన్నీ తానై ఆదుకుంటుంది.
తాజాగా ఒరిస్సా నుండి వలస వచ్చి చనిపోయిన ఓ మహిళకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించింది ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన విజయ్ అతని భార్య ఇద్దరు వలస వచ్చి పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ లో నివాసం ఉంటున్నారు. రోజు కూలీలుగా పని చేసుకుని జీవనం గడుపుతున్నారు. విజయ్ భార్య నీలిమ అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేదలైన వీరు మృతదేహాన్ని ఒరిస్సాకు తీసుకుపోలేక, నగరంలో అంత్యక్రియలు నిర్వహించలేక ఆర్థిక నిస్సహాయతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ తరుణంలో బండ్లగూడ మాజీ వార్డు సభ్యులు చంద్రశేఖర్, శ్రీనివాస్, అజ్జు, కాలీల్ ల సహాయంతో ఎండిఆర్ ఫౌండేషన్ ను సంప్రదించారు. మానవతా దృక్పథంతో పని చేస్తున్న ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు వెంటనే స్పందించి ఫౌండేషన్ తరఫున ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మృతురాలి భర్త తో పాటు గ్రామస్తులు ఎండిఆర్ ఫౌండేషన్ సేవలను అభినందించారు.