నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో స్పష్టీకరించిన శిక్షకుడు భరత్ భూసల్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఏదైనా కొత్త అంశాలను నేర్చుకునేటప్పుడు, దాని ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే, అది దానిపై లోతైన అవగాహనను పెంచి ప్రగతికి బాటలు వేస్తుందని గీతంలో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి, జైశ్రీరామ్.ఐవోలో టెక్ లీడ్ భరత్ భూసల్ అభిప్రాయపడ్డారు. గీతం, హైదరాబాదులోని శిక్షణ, సామర్థ్య అభివృద్ధి డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ‘ఇంజనీరింగ్ గందగోళం ఆరంభం: స్టార్టప్ లు, బృందాలను నడిపించడం, అమలు చేయడం’ అనే అంశంపై శనివారం ఆయన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. నేపాల్ కు చెందిన భరత్, తన పరిశ్రమ అనుభవం, అభ్యాస ప్రయాణం నుంచి విలువైన విషయాలను తోటి ఔత్సాహిక విద్యార్థులతో పంచుకున్నారు. సాంకేతికత, స్టార్టప్ ల సంక్లిష్టతలను అధిగమించడంపై కొత్త దృక్పథాన్ని అందించారు.నిరంతరం మారుతున్న సాంకేతిక రంగంలో రాణించాలంటే, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం, నిరంతర సాధన, సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను భరత్ నొక్కి చెప్పారు.

అధునాతన సాంకేతికతలను సమర్థంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యతకు వివరిస్తూ, పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా మనమూ మారాలని స్పష్టీకరించారు. నిరంతరం ప్రగతిశీలంగా యోచించే మనస్తత్వాన్ని అలవరచుకోవాలని తోటి విద్యార్థులను ప్రోత్సహించారు.రెండు రోజులలో, నాలుగు గంటల పాటు సాగిన ఈ శిక్షణలో, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్ డీఎల్ సీ), గిట్-గిట్ హబ్, నిరంతర ఇంటిగ్రేషన్ (సీఐ), నిరంతర విస్తరణ (సీడీ) వంటి కీలకమైన పరిశ్రమ అంశాలను భరత్ వివరించారు. ఏడబ్ల్యూఎస్ వినియోగం, ఈసీ2 క్లౌడ్ సేవలను మెరుగుపరచడం, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సామర్థ్యాన్ని అన్వేషించడం వంటి అధునాతన భావలను విద్యార్థులకు పరిచయం చేశారు.
అలాగే ఓ స్టార్టప్ ను ఎలా ప్రారంభించాలో ఆచరణాత్మకంగా వివరించారు. వ్యూహాత్మక అమలుతో సాంకేతిక నైపుణ్యాన్ని అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను భరత్ వివరించారు.జీవితంలో అత్యుత్తమంగా రాణించాలంటే, తరగతిలో చెప్పే బోధనకే పరిమితం కాకూడదని, మన ఆసక్తికి తగ్గ అంశాన్ని ఎంచుకుని, స్థిరంగా, అంకితభావంతో సాధన చేస్తే విజయాన్ని అందుకోగలమని భరత్ పేర్కొన్నారు. సహచర విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు తగిన జవాబులిచ్చి ఆకట్టకున్నారు. తమ సహ విద్యార్థి అనుభవాలను తెలుసుకోవడానికి ఇతర ఔత్సాహిక విద్యార్థులు ఉత్సుకతను ప్రదర్శించారు. ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి వర్చువల్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వాతావరణంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్జానానికి తగ్గట్టు తమ విద్యార్థులను సన్నద్ధం చేయడంలో గీతం నిబద్ధతను ఈ కార్యక్రమం చాటి చెప్పిందనడంలో అతిశయోక్తి లేదు.

