శ్రీశైలం, మార్చి 21, మనవార్తలు ప్రతినిధి :
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం నాడు ఉదయం జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామి కి విశేష అర్చనలు, చండీ శ్వర పూజ, మండపారధనలు, కలశార్చన, రుద్ర హోమం, రుద్ర పారాయణ, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ దేవి కి విశేష కుంకుమార్చనలు నవావరనార్చనలు, చండీ హోమం, శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు నిర్వహించారు.
నంది వాహనంపై మల్లికార్జునుడు- సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధీస్టింప జేసీ విశేష పూజలు, హారతులు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ను దర్శించటం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రీశైల భ్రామరీ వీణ, అక్షమాల,పుస్తకము మొదలైన చతుర్భజాలతో మహా సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దేవిని దర్శించటం వలన విద్యావ్యాప్తి తో పాటు అభీ ష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
అనంతరం ప్రత్యేక అలంకారంలో ఉన్న అమ్మవారిని, వాహానాధీషుడైన స్వామి అమ్మవార్ల కు అశేష జనవాహిని మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవంలో కళాకారుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు,గొరవయ్యాల నృత్యాలు, తప్పెట చిందులు, జానపద పగటి వేషాల ప్రదర్శన, నందికోల, చెక్క భజనలు, కర్ణాటక డోలు విన్యాసాలు, చిన్నారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్ల ను భక్తులు కనులారా దర్శించి కర్పూర నీరాజనాలను సమర్పించారు.వీరాచార విన్యాసాలు, అగ్నిగుండం ప్రవేశం రాత్రి 10 గంటలకు శివ దీక్షా శిబిరాలవద్ద కన్నడ భక్తుల చే అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించి వీరభద్రునివచనాలను పఠిస్తూ, వివిధ వేషధారణలతో, వీరాచార విన్యాసాలు చేశారు.