పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం మకర సంక్రాంతి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేక మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు . మకర సంక్రాంతి దేశవ్యాప్తంగా పలు పేర్లు , సంప్రదాయాలతో జరుపుకునే పంటల పండుగ . ఈ వేడుకలకు ప్రాంగణంలోని గీతం కేఫ్ వేదికగా నిలిచింది . రకరకాల ఆకృతులలో తీర్చిదిద్దిన రంగవల్లులు , రంగు రంగుల మృ ణ్యయ పాత్రలు , చెరకు గడలు , చెరకు రసం తీసే బండి , ఎద్దుల బండి ఈ వేడుకలను మరింత ఉత్సాహ భరితం చేశాయి . వర్ణశోభితమైన సంప్రదాయ దుస్తులలో వచ్చిన అధ్యాపకులు , సిబ్బందితో ప్రాంగణమంతా సందడిగా మారింది . ముగ్గులు , గాలిపటాల పోటీలు , పొంగలి చేయడం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి . అందరిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి . వాటన్నింటినీ నిక్షిప్తంగా చేసుకునేలా ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగడం , బృందాలు ఫోటోలు తీయించుకోవడం ఎటుచూసినా కనిపించింది . శ్రవణభరితంగా సాగుతున్న మంగళ వాయిద్యం విందును మరింత పసందుగా మార్చింది . జాతీయ యువజనోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గీతంలో జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .
గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ , ఈ – క్లబ్ , ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవాలలో ‘ జాగృతి ‘ పేరిట ప్రతియేటా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న వాసుదేవ్ వంగర తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు . వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీ నాటికి ఎలా పరిణతి చెందాలనే ఇతివృ త్తంతో విద్యార్థులంతా తమకు తాము స్వీయ లేఖలు రాసుకున్నారు . వాటిని తమవద్దే సురక్షితంగా ఉంచుకుని , వచ్చే ఏడాది తెరచి చూస్తారు . అప్పటివరకు తాము సంకల్పించిన ఎన్ని కార్యక్రమాలను పూర్తిచేసిందీ సమీక్షించుకోవాలనే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం . చివరగా పలు ఆసక్తికరమైన పోటీలను నిర్వహించడంతో పాటు వివేకానందుడిపై తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు .