ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని కొనసాగించండి

Telangana

క్యాడెట్లకు కల్నల్ రమేష్ సరియాల్ సూచన

విజయవంతంగా ముగిసిన ఎన్ సీసీ శిబిరం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎన్ సీసీ క్యాడెట్లంతా ఐక్యత, క్రమశిక్షణతో మెలగాలని, సమైక్యతా స్ఫూర్తిని కలకాలం కొనసాగించాలని సంగారెడ్డిలోని 33 (టీ) బెలాలియన్ ఎన్ సీసీ క్యాంప్ కమాండెంట్, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ సూచించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత పదిరోజులుగా నిర్వహిస్తున్న శిబిరం ముగింపు సమావేశంలో ఆయన క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ శిబిరం క్యాడెట్లను నిజంగా మార్చివేసిందని, వారిని బలమైన వ్యక్తిత్వంతో, లోతైన జాతీయ భావంతో సన్నద్ధం చేసిందని పేర్కొన్నారు. ఈ పది రోజుల ప్రయాణానికి ఇది ముగింపు కాదని, ఒక కొత్త ప్రారంభంగా ఆయన అభివర్ణించారు. ఐక్యత, క్రమశిక్షణ, స్థితిస్థాపకత యొక్క విలువలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దీని నిర్వహణకు ఆమోదించి, అత్యద్భుత సౌకర్యాలను కల్పించిన గీతం యాజమాన్యం, ఈ శిబిరాన్ని సజావుగా, సురక్షితంగా నిర్వహించడానికి తోడ్పడిన అసోసియేట్ ఎన్ సీసీ అధికారులు (ఏఎన్ఓలు), పీఐలు, పౌర సిబ్బందికి కల్నల్ సరియాల్ కృతజ్జతలు తెలియజేశారు.

ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఏ.ఫిలిఫ్ హాజరయ్యారు. జీవితంలో క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను వర్మ నొక్కి చెబుతూ, చీమలు అనుసరించే క్రమశిక్షణ, సంఘటిత జీవనంపై ఓ కథను ఉటంకించారు. యూనిఫాం గుర్తింపునే కాకుండా, స్థితిస్థాపకత, సమగ్రత, కరుణ, క్రమశిక్షణను కూడా అలవరుస్తుందని అంబికా చెప్పారు.దాదాపు 650 మంది క్యాడెట్లు పాల్గొన్న ఈ సమగ్ర శిక్షణా శిబిరాన్ని- నాయకత్వం, క్రమశిక్షణ, వ్యక్తిత్వం, జట్టుకృషి, జాతీయ సమైక్యత యొక్క లోతైన భావాన్ని పెంపొందించేలా రూపొందించారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు యోగాతో ప్రారంభమై, శారీరక శిక్షణ, డ్రిల్ సెషన్లు, రోల్ కాల్, ఆతిథ్య ఉపన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసేది. క్యాడెట్లు తమలో నిబిడీకృతంగా ఉన్న కళాభిరుచిని ప్రదర్శించడానికి వీలు కల్పించింది.

ఈ ముగింపు వేడుకలో వాలీబాల్, ఖోఖో, క్రాస్ కంట్రీ రన్నింగ్, డ్రిల్ వంటి వివిధ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు. క్యాడెట్ల నిబద్ధత, ఐక్యత, శక్తిని ప్రదర్శించే ప్రత్యేక సాంస్కృతిక వేడుకలు అందరినీ అలరించాయి. ఈ శిబిరంపై అధికారిక నివేదికను సమర్పించడంతో పాటు శిబిరం స్ఫూర్తి, కార్యకలాపాలను సంగ్రహించే వీడియో మాంటేజ్ ను కూడా ప్రదర్శించారు.ఈ ముగింపు ఉత్సవాలలో సుబేదార్ మేజర్ రామ్ హరి గుర్జార్, కెప్టెన్ పి.విజయ, లెఫ్టినెంట్ ఆర్.మహేందర్ రెడ్డి, లెఫ్టినెంట్ యాదగిరి, జె.శంకరయ్యతో పాటు గీతం ఎన్ సీసీ కేర్ టేకర్ ఆఫీసర్ ఎస్.అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పది రోజుల శిబిరం కేవలం జ్జాపకాలను మాత్రమే కాకుండా, బలం, విశ్వాసం, దేశానికి సేవ చేయాలనే అచంచలమైన స్ఫూర్తిని నింపింది. నిర్మాణాత్మక శిక్షణ యొక్క పరివర్తన శక్తికి, నేషనల్ క్యాడెట్ కార్ప్స యొక్క శాశ్వత ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *