పటాన్చెరులో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 890వ జయంతి వేడుకలు

politics Telangana

_మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని, ఆయన సూచించిన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మహాత్మ బసవేశ్వరుడి 890వ జయంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ జాతీయ రహదారి పక్కనగల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే కులం మతం వర్ణ వివక్షత లేని సమాజం కోసం అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి, అన్ని మతాలు ఒక్కటేనని, మనుషులందరూ సమానమేనని చాటిచెప్పిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వరుడని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంకు బండ్ పైన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో బీరంగూడలో 12 అడుగుల అశ్వరుడా బసవేశ్వరుడి విగ్రహాన్ని వారం రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాముల గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పొగాకు బసవేశ్వర్, నాయకులు, వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *