మహనీయుల జీవితాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

_సొంత నిధులతో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాల ఏర్పాటు

_ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విశ్వ గురు మహాత్మా బసవేశ్వర విగ్రహాలను ఏర్పాటుచేసి భవిష్యత్ తరాలకు వారి స్ఫూర్తిని అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సొంత నిధులతో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ కూడలి, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు వెలిమల తండాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలతోపాటు బీరంగూడ చౌరస్తాలో విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ నెల 12న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల తండా , 13న కొల్లూరులో, 14న పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. 16వ తేదీన బీరంగూడ చౌరస్తాలో విశ్వగురు మహాత్మ బసవేశ్వర విగ్రహాలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు విగ్రహావిష్కరణలకు హాజరయ్యేలా చూడాలని ప్రతినిధులకు సూచించారు. వీటితోపాటు మహాత్మా గాంధీ, చత్రపతి శివాజీ, చాకలి ఐలమ్మ ల విగ్రహాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈనెల 14న రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 120 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *