చెత్తను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం…

politics Telangana

– వ్యర్థాల నిర్వహణపై రేవతి మాచర్ల సూచన

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మన ఇళ్ళలో వచ్చే వ్యర్థాలలో తొంభై శాతం పునర్వినియోగించవచ్చని , తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని బయో – ఎంజెమ్స్ నిపుణురాలు , ప్రకృతి ప్రేమికురాలు రేవతి మాచర్ల సూచించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వంట చేసే సిబ్బంది , పారిశుధ్య పనివారితో మంగళవారం ఆమె ముఖాముఖి నిర్వహించారు . మనం ప్రతి నిత్యం వంట గదిలో ఎన్నో కాయగూరల తొక్క వలుస్తామని , వాటిని వృథాగా పడేయకుండా 600 గ్రాముల తొక్కలకు 200 గ్రాముల బెల్లం , రెండు లీటర్ల నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్లో భద్రపరచుకోవాలని , అందులో కొంత బయో ఎంజె చేర్చితే 30 రోజుల్లోనే మనకు ఉపకరించే పదార్థం తయారవుతుందని చెప్పారు . అది మొక్కలకు వేస్తే చాలా మంచి జరుగుతుందన్నారు . అలాగే 300 గ్రాముల లెమన్ గ్రాస్ , వంద గ్రాముల బెల్లం , లీటరు నీటిలో కొద్దిగా ఎంజెమ్ చేర్చితే ఇళ్లు శుభ్రపరచుకునే పదార్థం తయారవుతుందన్నారు . వేపాకులో బెల్లం , నీరు , కొంత ఎంజెమ్ వేస్తే నీమ్ ఎంజెమ్ వస్తుందని చెప్పారు .

అలాగే గులాబీ పూలు , తులసి ఆకులతో కూడా ఎంజెలు తయారుచేసి ఫేస్ ప్యాక్లుగా వినియోగించుకోవచ్చన్నారు . అయితే వీటికి ఎండ తగల కూడదని , అందులో ఉత్పత్తి అయ్యే వాయువు బయటకు పోయేలా మధ్యమధ్యలో మూత తీసి మళ్లీ బిగించాలని సూచించారు . మిగిలిపోయిన అన్నం , బియ్యపు / శనగ పిండిలో రోజ్ ఎంజెమ్ కలుపుకుని ముఖానికి రాసుకుంటే బాగా నునుపుదేలి మెరుస్తుందన్నారు . ఇవన్నీ చేయడం ద్వారా దాదాపు 90 శాతం చెత్తను సద్వినియోగం చేయడంతో పాటు చెత్త గుట్టలు పేరుకుని , మిథేన్ గ్యాస్ ఉత్పత్తి కాకుండా కాపాడగలనుని చెప్పారు . ప్రతియేటా జనవరి 4 ని బయో ఎంజెమ్స్ దినోత్సవంగా నిర్వహిస్తారని , ఆరోజు తాను కాయగూరలతో రూపొందించిన 40 లీటర్ల ఎంజెమైను గీతం ప్రాంగణం పక్కనున్న చెరువులో కలుపుతానని , అది నీటి పీహెచ్ స్థాయి పెరగడానికి తోడ్పడడంతో పాటు చేపల వృద్ధికి కూడా ఉపకరిస్తుందన్నారు . తొలిసారి కరోనా విజృంభించినప్పుడు తాను ఓ అభిరుచిగా చేపట్టిన బయో ఎంజెమ్స్ కార్యక్రమం నేడు . ఎంతోమందికి ఉపకరిస్తుందని ఆమె చెప్పారు . థాయిలాండ్లోని బయో ఎంజెమ్స్ శిక్షకురాలి సహకారంతో రూపొందించిన పలు బయో ఎంజెమ్స్ ను ఆమె చూపించారు . పలువురి సందేహాలను నివృత్తి చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *