_గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలి
_భూములు అమ్ముకోవద్దు..రైతులకు సూచన
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామపంచాయతీ కీ ఫర్నిచర్ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,జిన్నారం
గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మండల కేంద్రమైన జిన్నారం లో 60 లక్షల రూపాయల హేట్రో సంస్థ సీఎస్ఆర్ నిధుల తో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. 10 కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో జిన్నారం లో నిర్మిస్తున్న మినీ స్టేడియం కోసం కోటి రూపాయలతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 75 లక్షల రూపాయలతో గ్రామ ప్రధాన రహదారి నుండి హనుమాన్ గుడి వరకు నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఫర్నిచర్ అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల చేపట్టినప్పుడే వారి నమ్మకానికి సార్థకత చేకూరుతుందన్నారు. చిన్న గ్రామ పంచాయతీల ద్వారా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుందన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నూతన గ్రామపంచాయతీలలో శాశ్వత ప్రాతిపదికన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నా లక్ష్యంతో ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో 3 మినీ స్టేడియాలు నిర్మిస్తుండగా, జిన్నారం లో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నారం తో పాటు సమీపంలోని అన్ని గ్రామాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిన్నారం, గుమ్మడిదల మండలాల అభివృద్ధికి స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, ప్రజలు భూములు అమ్ముకోవద్దని, భవిష్యత్తులో కోట్ల రూపాయల విలువ రాబోతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం కిష్టయ్య పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.