కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆరంభం – ప్రారంభోపన్యాసం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

Hyderabad politics Telangana

పటాన్‌చెరు:

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనంగా ప్రారంభించారు. విధాన నిర్ణేతలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దార్శనికతలను అందించాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అధ్యక్షుడిగా ఎదిగే వరకు జరిగిన ముఖ్య పరిణామాలు, ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంధించిన పలు ప్రశ్నలకు సమయస్ఫూర్తితో యుక్తిగా జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. విధానం, ప్రణాళిక అనే అంశాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ సవివరంగా ప్రసంగించారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వరకు నెహ్రూ విధానాలే అమలు జరిగాయన్నారు. పంచవర్ష ప్రణాళికలలో అభివృద్ధిని లక్ష్మీస్తూ నీటిపారుదల, పరిశ్రమలు, విద్య వంటి రంగాల ఉన్నతికి బాటలు వేసినట్టు చెప్పారు. దురదృష్టవశాత్తూ వినూత్న ఆలోచనలల్లో మనం వెనుకంజ వేశామని, ఇకపై మనమంతా వస్తూత్పత్తి పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విధాన నిర్ణేతల కోసం గీతం వైపు చూసే రోజు భవిష్యత్తులో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

కేఎస్ పీపీ డీన్, పూర్వ ఐఎస్ అధికారి, ఐక్యరాజ్య సమితిలో భారతీయ శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ అవరోధాలను గుర్తెరిగి వాటిని అధిగమించడం, విధాన నిర్ణయాలేమిటో అర్థం చేసుకోవడాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. కౌటిల్యా గురించి: హైదరాబాద్ లోని అత్యాధునిక పబ్లిక్ పాలసీ స్కూలుగా పేరొందిన కేఎస్ పీపీని 2020 లో స్థాపించగా, ఇది భారతీయ నైతికత, సంస్కృతి, విలువలను పాశ్చాత్య ప్రజా విధాన చట్రాలతో మిళితం చేస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఐవీ లీగ్ విధాన పాఠశాలల తరహాలో జ్ఞానాన్ని వృద్ధిచేసే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. రెండేళ్ళ నిడివి గల మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీని కోర్సును రెసిడెన్షియన్ విధానంలో నిర్వహిస్తోంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులను ఒకచోట చేర్చి వారిని విధాన నిర్ణేతలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *