పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని వెంకట లక్ష్మీ దీప్తి వి. డాక్టరేట్ కు అర్హత సాధించారు. నానోఫ్లూయిడ్ ప్రవాహ సమస్యల గణిత నమూనా, విశ్లేషణపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఆమె చేసిన పరిశోధన అనువర్తిత గణితం, ద్రవ డైనమిక్స్ రంగానికి గణనీయమైన సహకారాన్ని సూచిస్తోంది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. శ్రీనివాస రాజు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.4వ-ఆర్డర్ రంజ్-కుట్టా పద్ధతి, షూటింగ్ టెక్నిక్ తో మ్యాట్ ల్యాబ్, మాథమెటికాలోని సిమ్యులేషన్ల ద్వారా ఆమె కనుగొన్న విషయాలు, ఇంజనీరింగ్, పారిశ్రామిక ప్రక్రియలలో వినియోగించేందుకు గాను విలువైన అంతర్దృష్టులను అందిస్తాయన్నారు. ఈ పరిశోధనలో భాగంగా, ఆమె ఆరు పరిశోధనా పత్రాలను ప్రముఖ జర్నళ్లలో ప్రచురించినట్టు తెలియజేశారు.డాక్టర్ లక్ష్మీ దీప్తి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.డాక్టర్ లక్ష్మీదీప్తి సాధించిన విజయం, అధిక-ప్రభావ పరిశోధనలను ప్రోత్సహించడంలో, సైన్స్, ఆవిష్కరణలలో భవిష్యత్తు నాయకులను పెంపొందించడంలో గీతం యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు.