కాటా శ్రీనివాస్ గౌడ్ విమర్శలు అర్ధ రహితం.. అవగాహనరాహిత్యం..

politics Telangana

_ప్రభుత్వ స్థలంలో అనుమతి లేని నిర్మాణాలు చేపడితే సమర్ధించాలా..

_బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ధ్వజం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమస్యపై అవగాహన లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి అవగాహనరాహిత్యానికి నిదర్శనమని భారత రాష్ట్ర సమితి పటాన్చెరు సీనియర్ నాయకులు విమర్శించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..భారత రాష్ట్ర సమితి పటాన్చెరు మండల అధ్యక్షులు పాండు, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ.. పటాన్చెరు మండలం భానూరు గ్రామపంచాయతీ పరిధిలోని పశువైద్యశాలకు సంబంధించిన ప్రహరీ గోడను ఇటీవల గ్రామపంచాయతీ సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు.. ప్రభుత్వ అనుమతి లేకుండా ధ్వంసం చేయడంతో పాటు వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.ఈ అంశంపై సంబంధిత శాఖ అధికారులు పోలీసులకు, సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.విచారణ అనంతరం పనులు నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఇటీవల భానూరు గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామ సమస్యపై ఎలాంటి అవగాహన లేకుండా.. అభివృద్ధి పనులు చేస్తుంటే స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ విమర్శలు చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.గతంలో అమీన్పూర్ సర్పంచ్ గా పని చేసిన సమయంలో కాటా చేసిన అక్రమాలు, కబ్జాలు, అనుమతి లేని నిర్మాణాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలకు సేవ చేస్తానంటూ ప్రగల్భాలు పలకడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.గురువింద గింజ వలె నీతులు చెప్పడం మాని అభివృద్ధిలో భాగస్వాములు అయితే ప్రజలు హర్షిస్తారే తప్ప .. కబ్జాలు అక్రమ నిర్మాణాలకు వంత పాడితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయకులు సత్యనారాయణ, అజ్మత్, సాయినాథ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *