ప్రజా కవిని స్మరించుకుని నివాళులర్పించిన గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ కవి, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కాళోజీ నారాయణరావు 111వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్టూడెంట్ లైఫ్ విభాగం వారు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ కాళోజీ నారాయణరావు (9 సెప్టెంబర్ 1914 – 13 నవంబర్ 2002) ప్రజా కవిగా ప్రసిద్ధి చెందారు. తన రచనల ద్వారా సామాజిక స్పృహను పెంపొందించడంతో పాటు మానవ విలువలను ప్రతిబింబించిన ప్రముఖ సాహిత్యవేత్త. ఆయన అపార కృషికి గుర్తింపుగా, 1992లో కాళోజీకి పద్మవిభూషణ్ అవార్డును ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించగా, ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఈ సందర్భంగా, గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు పుష్పగుచ్ఛాలు అర్పించి, కాళోజీ శాశ్వత వారసత్వాన్ని గుర్తుచేసుకున్నారు. వెరపులేని రచయితగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాన్య ప్రజల గొంతుకగా ఆయన పాత్రను ప్రోవీసీ కొనియాడారు. కాళోజీ రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని, తెలంగాణ సాంస్కృతిక గుర్తింపునకు చిహ్నంగా ఉన్నాయన్నారు.గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం – క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, బోధన, బోధనేతర సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా కవికి ఘన నివాళులు అర్పించారు.తెలంగాణ యొక్క గొప్ప సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, ప్రోత్సహించడం పట్ల గీతం నిబద్ధతను ఈ స్మారక కార్యక్రమం ప్రతిబింబించడంతో పాటు విద్యార్థులలో సామాజిక బాధ్యత విలువలను కూడా పెంపొందిస్తోంది.