మనవార్తలు ,శేరిలింగంపల్లి :
నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు అనే నానుడిని నిజం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తుంది బి హెచ్ ఈ ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ . ఎక్కడ ఎలాంటి పోటీలు జరిగినా అక్కడ జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను గుర్తిస్తూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు అధ్యాపక బృందం. ప్రతిసంవత్సరం నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్ ఫైర్ ఎగ్జిబిషన్ కం ప్రాజెక్ట్ కాంపిటేషన్ లో. విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుస్తున్నారు.
అలాగే ఈ సంవత్సరం కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ న్యూ ఢిల్లీ మరియు ఎస్.సి.ఈ.ఆర్.టి హైదరాబాద్ వారు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్ కం ప్రాజెక్ట్ కాంపిటీషన్ లో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 132 ప్రదర్శనలు పాల్గొనగా అందులో 14 ఎంపికవ్వగా అందులో రామచంద్రాపురం మండలం నుండి రెండు ఎంపికవ్వగా అందులో జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అమిరిశెట్టి నిహారిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల స్కూల్ ఫాదర్ అండ్రూస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి లు విద్యార్థిని ని అభినందించారు. ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థిని నిహారిక రైతులకు ఉపయోగ పడే రిమోట్ అపరేటెడ్ అగ్రికల్చర్ సీడింగ్ మిషన్ ను తయారు చేసి తన ఆలోచనకు, ఆవిష్కరణలకు పదును పెట్టింది.
రైతులకు ఎంతో మేలు …..
రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసే నాట్లు వేసే మిషన్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, లేబర్ ఖర్చుతో పాటు సమయాభావం కూడా కలిసొస్తుందని హెడ్ ఆఫ్ ద సైన్స్ డిపార్ట్మెంట్ హిమబిందు తెలిపారు. తక్కువ ఖర్చుతో, తక్కువ మంది కూలీలతో ఎక్కువ లాభాలు పొందేందుకు ఇలాంటి పరికరాలు, యంత్రాలు ఎంతో అవసరం అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు కష్ట పడకుండా కూర్చున్న చోటు నుండే అన్నివిధాలా వ్యవసాయానికి ఉపయోగకరమైన పరికరాలు, యంత్రాలు తయారు చేసేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆమె కోరారు.
అన్నివిధాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తాం – ఉమామహేశ్వరి
వ్యవసాయ దారులకు మేలు చేసే ఇలాంటి యంత్రాలు, పరికరాలను రూపొందించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులను మా సిబ్బంది సమకూర్చి వారి విజయంలో సిబ్బంది పాత్ర ఉండేలా చూస్తామన్నారు. విద్యార్థులు ఇలాంటి చక్కటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మరిన్నీ పోటీ పరీక్షల్లో, ఎగ్జిబిషన్ లలో తమ ప్రతిభను చాటుకుంటు స్కూల్ కు, అధ్యాపక బృందానికి మంచి గుర్తింపు తీసుకువస్తు వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.