పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటి తరం విద్యార్థులు అర్థవంతమైన లక్ష్యాలను సాధించాలని, సమాజానికి సృజనాత్మకంగా దోహదపడాలని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ)లోని రాజకీయ అధ్యయనాల కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ సిద్ధాంతకర్త, విశ్లేషకుడు డాక్టర్ అజయ్ గుడవర్తి సూచించారు.గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘జెన్ జీ (నేటి యువత) – భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యంలో జెన్ జీ యొక్క ప్రమేయంపై సూక్ష్మ అవగాహనను అందించారు.

విలువలు, నీతి, రాజకీయ పద్ధతులలో వేగవంతమైన అంతర్గత మార్పులను డాక్టర్ అజయ్ ప్రముఖంగా ప్రస్తావించారు. జెన్ జీ రాడికల్ వ్యక్తిత్వం, సామాజిక ఉదాసీనతను ప్రదర్శిస్తున్నప్పటికీ, అది ఏకకాలంలో తక్కువ పక్షపాతంతో, మరింత సమ్మిళితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమకాలీన యువత నేతృత్వంలోని రాజకీయ ఉద్యమాలు ఎక్కువగా నాయకత్వం లేనివి, ఎపిసోడిక్ గా ఉన్నాయని, సామూహిక రాజకీయాల యొక్క సాంప్రదాయ భావనలను పునర్నిర్మించే సైద్ధాంతిక బోధన కంటే ఆదర్శప్రాయమైన చర్య ద్వారా నడపబడుతున్నాయని అన్నారు.జెన్ జీను వర్ణించే విశ్వాసం, ఆందోళన యొక్క వైరుధ్యాలను డాక్టర్ అజయ్ గుడవర్తి మరింత విపులీకరించారు.
దీనిని సరళీకరణ అనంతర యుగంలో కుంచించుకుపోతున్న ఆర్థిక అవకాశాలతో పాటు విస్తరించిన సామాజిక ప్రజాస్వామ్యానికి అనుసంధానించారు. నేటి యువత రాజకీయాలను రూపొందించడంలో గుర్తింపు, రాజకీయ ఆత్మాశ్రయత, వినియోగం యొక్క పెరుగుతున్న కలయికను కూడా ఆయన నొక్కి చెప్పారు. చివరగా విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని సుప్రీ రంజన్ సమన్వయం చేశారు. జీఎస్ హెచ్ఎస్ ఇన్-ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు, డాక్టర్ మయాంక్ మిశ్రా, రిషిజా సింగ్, పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
