హాజరైన వేలాదిమంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు
రెండు గంటల పాటు నిర్విరామంగా యోగా విన్యాసాలు.
యోగా విశిష్టతను తెలిపేలా యోగా భంగిమలు.
యోగా దినచర్యలో భాగం కావాలి
ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా సువర్ణ అవకాశం
పటాన్‌చెరు చరిత్రలోనే అతిపెద్ద యోగా డే వేడుకలు
సమాజం నుండి డ్రగ్స్ ను వెలివేయాలి
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటాన్‌చెరు చరిత్రలోనే మొట్ట మొదటిసారి వేలాదిమందితో కలిసి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు.ఉదయం 6:30 నుండి 09:00 గంటల వరకు పతాంజలి యోగ సమితి శిక్షకుల సౌజన్యంతో రెండున్నర గంటల పాటు వివిధ రకాల యోగా భంగిమలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగ ప్రాముఖ్యతను తమ ఆసనాల ద్వారా వివరిస్తూ సంపూర్ణమైన ఆరోగ్య జీవనశైలికి యోగ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు.
ఈ సందర్భంగా పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టకపోవడం మూలంగా మానసిక, శారీరక సమస్యలతో నిరంతరం బాధపడుతూ అనారోగ్యకరమైన జీవితాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజలకు యోగ ప్రాముఖ్యతను తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో.. మైత్రి మైదానంలో యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మనిషి నిత్యం ఎదుర్కొనే మానసిక, ఆరోగ్య సమస్యలకు సర్వరోగ నివారిని యోగ అని అన్నారు. యోగాకు కులం మతం ప్రాంతం జాతి లేదని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమని తెలిపారు. యావత్తు ప్రపంచానికి భారతదేశం అందించిన మహోన్నత సాధనం యోగ అని అన్నారు.
ఈ సందర్భంగా పటాన్‌చెరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. విద్యార్థి దశనుండే మత్తు పదార్థాల వినియోగం, వాటి దుష్ఫలితాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్
తొలిమలి దశ తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రత్యేక తెలంగాణ సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు డిఎస్పి ప్రభాకర్, భారత్ స్వాభిమాన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, పతంజలి యోగాసమితి రాష్ట్ర అధ్యక్షులు పస్పరి శివుడు, యోగ గురువు శివకుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.