ఆరోగ్య పరిరక్షణపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. ‘ఫార్మాస్యూటికల్, హెల్త్ సైన్సెస్ లో సమీకృత పోకడలు’ అనే అంశంపై ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు, మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకులు డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ ఆశిష్ ఆర్ ద్వివేది మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి గౌరవనీయమైన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఒకచోట చేర్చి, ఫార్మాస్యూటికల్, కెమికల్, బయోలాజికల్, హెల్త్ సైన్సెస్ లలో సమగ్ర పరిశోధనా పోకడల తాజా పురోగతులపై చర్చించనున్నట్టు తెలియజేశారు. ఆయా ప్రముఖుల వినూత్న ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి ఒక వేదికను రూపొందించడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. సహజ, ఆరోగ్య శాస్త్రాలలో సమకాలీన పురోగతులు, సవాళ్లపై అమూల్యమైన అవగాహనను కల్పించడమే గాక, ఈ సదస్సులో ప్లీనరీ సెషన్ లు, కీలక ప్రసంగాలు, విశిష్ట నిపుణులతో చర్చలు ఉంటాయన్నారు.

ప్రముఖ అంతర్జాతీయ వక్తలు అమెరికా (కాలిఫోర్నియా)లోని చాప్ మన్ విశ్వవిద్యాలయం ఫార్మసీ ప్రొఫెసర్ కీకావన్ పరంగ్, శ్రీలంకలోని వయాంబ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ ఎస్. జీవతయాపరన్, సింగపూర్ లోని నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గావో యోంగ్గుయ్, మలేషియాలోని అంతర్జాతీయ వైద్య విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ త్యాగరాజన్ మాధేశ్వరన్, అమెరికాలోని సైటోమ్ఎక్స్ థెరప్యూటిక్స్ కు చెందిన డాక్టర్ రాఘవ శ్రీరామనేని, క్రోయేషియాలోని రూడర్ బోస్కావిక్ ఇన్ స్టిట్యూట్, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ సెంటర్ కు చెందిన డాక్టర్ జురికా నోవాక్, దక్షిణ కొరియా చుంగ్ ఆంగ్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ గంగరాజు గెడ్డ తదితరులు పాల్గొని, తమ నైపుణ్యాలను సదస్యులతో పంచుకుంటారని వివరించారు.

యువ శాస్రవేత్తలు తమ పరిశోనలను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందేందుకు, ఉత్తమ పోస్టర్, బెస్ట్ ఓరల్ ప్రెజెంటేషన్, గౌరవనీయమైన యంగ్ సైంటిస్ట్ అవార్డులతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల కోసం పోటీపడేందుకు కూడా ఈ సమావేశం ఒక అద్భుత అవకాశంగా నిర్వాహకులు పేర్కొన్నారు.ఫార్మాస్యూటికల్, హెల్త్ సైన్సెస్ లో సమగ్ర ధోరణులపై పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నామని, ఎంపిక చేసిన పత్రాలను స్కోపస్-ఇండెక్స్డ్ జర్నల్ తో పాటు కాన్సరెన్స్ అబ్ స్ట్రాక్ట్ బుక్ లెట్ లో ప్రచురిస్తామని వారు తెలిపారు. అవసరమైన వారికి రోజువారీ అద్దె ప్రాతిపదికన వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.పేర్ల నమోదు, రుసుము, ఇతర వివరాల కోసం డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ ఆశిష్ ఆర్ ద్వివేదిలను సంప్రదించాలని, లేదా healthcarenext2025@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *