గీతంలో అంతర్జాతీయ సదస్సు

Telangana

జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ,

అనువాద పరిశోధనపై చర్చ

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశంలోని ప్రయోగశాల జంతు శాస్త్రవేత్తల సంఘం (ఎల్ఏఎస్ఏ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధన’ పేరిట అంతర్జాతీయ సదస్సును ఈనెల 19-20 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ 13వ అంతర్జాతీయ ప్రీక్లినికల్ సదస్సుకు ముందురోజు, డిసెంబర్ 18న ఒక కార్యశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ జి. సుహాసిన్, డాక్టర్ ఎం.జె. మహేష్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యశాలలో, ప్రీక్లినికల్ పరిశోధన నాణ్యతను పెంపొందించడానికి, శాస్త్రీయ అధ్యయనాలలో ప్రయోగశాల జంతువుల నైతిక, మానవీయ, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఎల్ఏఎస్ఏ సభ్యులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, ప్రీక్లినికల్, అనువాద పరిశోధనలో నిమగ్నమైన పరిశోధకులకు శక్తివంతమైన వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు.

ఈ సమావేశంలో వినూత్న పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడంతో పాటు ఇటీవలి శాస్త్రీయ పురోగతులను వెల్లడిస్తుందన్నారు. ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధికి మద్దతు ఇచ్చే కీలకమైన అంశాలను అందిస్తుందని తెలిపారు.ఈ రెండు రోజుల సదస్సు విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నియంత్రణ సంస్థల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించి, ప్రోత్సహించడమే గాక, వారి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిపుణులు, పరిశోధనా పండితులు, పరిశ్రమ నాయకులు అందించే కీలక ఉపన్యాసాలు, సాంకేతిక ప్రదర్శనలు, ముఖాముఖి చర్చలు, పోస్టర్ల ప్రదర్శన ఉంటాయని తెలియజేశారు.

ముందుగా నిర్వహించే కార్యశాల, ప్రధాన సమావేశం రెండింటిలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకునే ప్రతినిధులకు ఒకే రిజిస్ట్రేషన్ కిట్ లభిస్తుందన్నారు. ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం కింద పరిమిత సంఖ్యలో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో మౌఖిక ప్రదర్శనలకు ఆరు, పోస్టర్ల ప్రదర్శనకు 12 అవార్డులను ఇచ్చి సత్కరిస్తామన్నారు.మరిన్ని వివరాలు, పేర్ల నమోదు కోసం www.lasacon2025vizag.com, or www.lasaindia.com. వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *