_రుద్రారం గ్రామంలో 11 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల,
_అంగన్వాడి భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు, ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఎం వై కే లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడి భవనం, తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం, ఆర్వో ప్లాంట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిపుణులైన సిబ్బందితోపాటు అన్ని రకాలైన మౌలిక వసతులు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేయడంతో పాటు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు కేటాయించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వీటితోపాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించారని గుర్తు చేశారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం నిరుపేద విద్యార్థుల విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు వివిధ పరిశ్రమల సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులతో భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సంస్థ ముఖ్య ప్రతినిధులు శ్రీకర్, రోహిత్, సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ యాదయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.