=ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మధుర స్వామినాథన్ – త్రిపుర రైతులపై పుస్తకావిష్కరణ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతదేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, వ్యవసాయ వర్గ సంబంధాలపై చారిత్రక, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ మధుర స్వామినాథన్ అన్నారు. బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషణ విభాగాధిపతి అయిన ఆమె మంగళవారం ‘సమకాలీన భారతదేశంలో వ్యవసాయ సంబంధాలు’ అనే అంశంపై అతిథ్య ఉపన్యాసం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సులోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తమిళనాడులో గమనించిన మార్పులను ప్రస్తావిస్తూ, గ్రామీణ భారతదేశంలోని వ్యవసాయ సంబంధాల సంక్లిష్ట, స్వభావంపై ఉపన్యాసించారు.మనదేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భూస్వాములు, రెతులు, వ్యవసాయ కార్మికులతో సహా వివిధ తరగతులను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. స్థానిక వైవిధ్యాలను, చారిత్రక, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించాలన్నారు. గ్రామీణ రుణం, భూమి యాజమాన్యం, గ్రామీణ భారతంపై పెట్టుబడిదారీ విధానం వంటి సమస్యలను ఆమె వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు జవాబులిచ్చారు.

ఈ సందర్భంగా, సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాకిబ్ ఖాన్ రచించిన ‘ట్రైబ్ క్లాస్ లింకేజ్: త్రిపురలోని రైతాంగ ఉద్యమ చరిత్ర, రాజకీయాలు’ అనే పుస్తకాన్ని డాక్టర్ స్వామినాథన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం త్రిపురలోని గిరిజన జనాభాలో వ్యవసాయ వర్గ సంబంధాల అభివృద్ధికి సంబంధించిన చారిత్రక అధ్యాయనాన్ని వివరిస్తుంది. డాక్టర్ ఖాన్ తన పరిశోధనా ప్రయాణం, ఈ పుస్తకాన్ని రచించడంలో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను ఈ సందర్భంగా పేర్కొన్నారు.జీఎస్ హెచ్ఎస్ డైరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని స్వాగతించి, సదస్యులకు పరిచయం చేశారు. డాక్టర్ రోమా వందన సమర్పణతో ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమం ముగిసింది.
