పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశముని, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ఆధిపత్యం, నిష్పాక్షిక, అందుబాటులో ఉండే న్యాయ వ్యవస్థ వంటి ప్రధాన స్తంభాలపై నిలిచిన రాజ్యాంగం దాని సొంతమని నల్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. భారత గణతంత్ర దినోత్సవంలో భాగంగా, ‘రాజ్యాంగం, సామాన్యుడిపై దాని ప్రభావం’ అనే అంశంపె గురువారం ఆయన గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎసీహెచ్ఎస్)లో ఆతిథ్య ఉపన్యాసం చేశారు.రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడూ చదవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెబుతూ, ముందుగా రాజ్యాంగాన్ని ఆకళింపు చేసుకుని, అందులో పొందుపరచిన ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాలను అర్థం చేసుకుని, మనదెనై ఒక అభిప్రాయానికి రావొచ్చని ప్రొఫెసర్ రావు సూచించారు. సామాన్య పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి, వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
భారత రాజ్యాంగం ఏడు ఆలోచనలు, లక్ష్యాలు, రాజ్యాంగ రూపకల్పన, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ మార్పుల గురించి ఆయన విడమరిచి చెప్పారు. భారత రాజ్యాంగం సజీవ పత్రమని, స్వాతంత్ర్య పోరాట విలువలను ప్రతిబింబిస్తూ న్యాయమైన, స్వేచ్ఛాయుత సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోందన్నారు.కేశవానంద భారతి, మేనకా గాంధీ, అయోధ్య తీర్పు వంటి పలు మెలురాళ్ల వంటి కేసులను ఉటంకిస్తూ, న్యాయవ్యవస్థ, సమాఖ్యవాదం, భారత రాజ్యాంగ పరిణామాలను డాక్టర్ శ్రీకృష్ణదేవరావు వివరించారు. రాజ్యాంగం యొక్క డెన్డమిక స్వభావాన్ని, సామాజిక-రాజకీయ, ఆర్థిక సందర్భాలలో దానిని అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతలను ఆయన నొక్కిచెప్పారు.
దీనితోపాటు, రాబోయే సంవత్సరాలలో ఉన్నత విద్య, అంతర్జాతీయకరణ, విద్యారంగాన్ని రూపొందించ డంలో సాంకేతికత పాత్ర, భవిష్యత్తులో సంభవించనున్న మార్పులను ఏకరువు పెట్టారు. గీతం గ్రంథాలయం ఉంచమని సూచిస్తూ, రాజ్యాంగ ప్రతులను ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు విరాళంగా ఇచ్చారు. పొలిటికల్ సెన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీఎసీహెచ్ఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ జి.జోస్ స్వాతోపన్యాసం చేసి, అతిథిని సత్కరించారు. రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడూ చదవాల్సిన ఆవశ్యకత, భారత రాజ్యాంగం పరిణామం, భారతదేశంలో విద్య, దాని భవిష్యత్తు వంటి పలు అంశాలను సృజిస్తూ సాగిన ఆలోచనాత్మక ప్రసంగం విద్యార్థులు, అధ్యాపకులందరినీ ఆకట్టుకుంది.