పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో సోమవారం ప్రమాణ-2025 సచివాలయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ప్రారంభించారు. గీతంలో ప్రతియేటా సాంకేతిక-సాహిత్య-నిర్వహణల మేలుకలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్, సింఫోనీ, కన్సర్ట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, కార్నివాల్, పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.ప్రమాణ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మాట్లాడుతూ, నూతన సాంకేతికత మేళవింపుతో కార్యక్రమాలను ఎంపిక చేసి, ఇతర కళాశాలల విద్యార్థులు విరివిగా పాల్గొనేలా వాటిని రూపొందించమని సూచించారు. రోబోటిక్స్, ఈ-యంత్ర, హ్యాకథాన్, డిజైన్ పోటీలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలను అత్యాధునిక సాంకేతికతతో ఉండేలా చూడాలన్నారు.

ప్రచారం విద్యార్థులను ఆకర్షిస్తుందని ఎక్కువ మంది పాల్గొంటేనే మన ఉత్సవ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని చెప్పారు.గీతం, హైదరాబాద్ లో ఉన్న ఏడు స్కూళ్ల (టెక్నాలజీ, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీ) విద్యార్థులందరూ పెద్దయెత్తున పాల్గొనేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ సూచించారు.గత ఉత్సవాల కంటే ఈ ఏడాది ప్రమాణ-2025 మేటిగా ఉండేలా తీర్చిదిద్దమని ప్రమాణ నిర్వాహకుడు డాక్టర్ పి.త్రినాథరావు సలహా ఇచ్చారు.గీతం బీ-స్కూల్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు తదితరులు ప్రమాణ-2025 కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, విజయవంతం కావాలని అభిలషించారు.
