_పటాన్చెరులో ఎగిరిన 150 అడుగుల మువ్వన్నెల జెండా
_మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ శ్రేణులు
_సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనస్సుతో ఆశీర్వదించండి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తూ, రోజు రోజుకి అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశంసలతో ముంచెత్తారు.ఇంట్లో సంక్షేమం ఇంటి ముంగట అభివృద్ధితో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిండు మనసుతో ఆశీర్వదించి, సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలో మూడు కోట్ల 26 లక్షల రూపాయలతో నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, 150 అడుగుల జాతీయ జెండా, 2 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, ఒక కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించిన డీసీసీబీ బ్యాంకు నూతన భవనాలను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన వార్డు కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒకనాడు కాలుష్య జలాలతో పటాన్చెరువు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని.. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నామని తెలిపారు.ఇటీవల సీఎం కేసీఆర్ పటాన్చెరులో పర్యటించి వరాల జల్లు కురిపించారని అన్నారు. సుమారు 128 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు.
బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 75 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల రహదారిని విస్తరించి ప్రజల కలను సాకారం చేశామని అన్నారు.రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయిసముద్రం చెరువును అతి త్వరలో సుందరీకరణ చేస్తామని తెలిపారు.స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ల విజ్ఞప్తి మేరకు రామచంద్రాపురంలో గల ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చేలా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు.భారతి నగర్ డివిజన్ పరిధిలో బిహెచ్ఇఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని గత కొంతకాలంగా స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారని. వెంటనే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ ను మంత్రి ఆదేశించారు.ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
సొంత నిధులతో వికలాంగులకు స్కూటీలు అందించడంతోపాటు వందలాది మంది విద్యార్థులకు ఉచిత కానిస్టేబుల్ శిక్షణ అందించిన ఘనత స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కే దక్కిందని ప్రశంసించారు.గత ప్రభుత్వాల హాయంలో బూతు బంగ్లాగా తయారైన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ఆధునికరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరిక మేరకు అప్పటి రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి విజ్ఞప్తి చేసి ఆధునిక హంగులతో రెండు కోట్ల 40 లక్షల రూపాయలతో గెస్ట్ హౌస్ ను పునర్ నిర్మించడం జరిగిందని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తే పటాన్చెరువు వరకు మెట్రో రైలు అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించారని గుర్తు చేశారు. దీంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే సుల్తాన్పూర్ లో మెడికల్ డివైస్ పార్క్, శివానగర్లో ఎల్ఈడి పార్కులు ప్రారంభించామని, త్వరలోనే ఉస్మాన్ నగర్ లో ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులని, ప్రతిపక్షాల దింపుడు కళ్లెం ఆశల్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. తమ పార్టీ పక్కన పెట్టిన నాయకులను ప్రతిపక్ష పార్టీలు చేర్చుకుంటూ అధ్యక్షులుగా పట్టం కట్టిన రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూడడంతో పాటు, తెలంగాణకు రావలసిన కోచ్ ఫ్యాక్టరీని ఉత్తరాది రాష్ట్రాలకు తరలించి కేవలం 6000 కోట్ల రూపాయలతో వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వారి వివక్షతకు నిదర్శనమని దుయ్యబట్టారు.భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చింది అంటే కేవలం శిష్కప్రియలు శూన్య హస్తాలు మాత్రమేనని అన్నారు.మంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు.