నాలుగు రోజుల పాటు కొనసాగనున్న కార్యశాల
నైపుణ్యాలను పెంపొందించనున్న పరిశ్రమ నిపుణులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కంటెంట్ సృష్టి, కమ్యూనికేషన్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న వాతావరణానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా నాలుగు రోజుల ‘కంటెంట్ రైటింగ్ వర్క్ షాప్’ను గీతం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) మంగళవారం ప్రారంభించారు. మీడియా స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధిలో జీవితకాల పెట్టుబడిగా రూపొందించారు.ఈ వర్క్ షాప్ ను జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ లాంఛనంగా ప్రారంభించి, సాంకేతికత పరిజ్జానం యొక్క మార్పుకు అనుగుణంగా, ముఖ్యంగా కంటెంట్ రైటింగ్ వృత్తిపై కృత్రిమ మేధస్సు ప్రభావాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యశాల ప్రాంగణ నియామకాలకు సిద్ధం కావడం గురించి మాత్రమే కాదని, కాలానుగుణంగా అభివృద్ధి చెందడం గురించన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
కెరీర్ గైడెన్స్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మమతా రెడ్డి మాట్లాడుతూ, కొత్త సాంకేతికతలను స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఒక ప్రత్యేక ఆలోచనా విధానాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం’ అని ఆమె హితబోధ చేశారు. ఈ కార్యశాల నిరంతర అభ్యాస సంస్కృతిని పెంపొందించడంలో నిర్వాహకుల దూరదృష్టికి నిదర్శనంగా ఆమె అభివర్ణించారు.మొదటి సెషన్ రిసోర్స్ పర్సన్ గా జియో మారియా పాల్గొని, కంటెంట్ రైటింగ్ ప్రాథమిక అంశాలు, కంటెంట్ రకాల, ఎస్ఈవో టెక్నిక్ వంటి కీలక అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. తరువాతి రెండు సెషన్లలో కంటెంట్ కమ్యూనికేషన్, వ్యక్తిగత బ్రాండింగ్ వంటి వాటిని వివరించారు.
మరో మూడు రోజులు కొనసాగే ఈ కార్యక్రమంలో పరిశ్రమ నిపుణులు పాల్గొని ఆయా అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్, మీడియా స్టడీస్ విభాగాధిపతి ఎస్ ఆర్ సంజీవ్ కుమార్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కంటెంట్ రైటింగ్ పరిశ్రమ యొక్క సవాళ్లు, అవకాశాలకు సిద్ధం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది యూజీ, పీజీ విద్యార్థులు పాల్గొంటున్నారు.