అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అన్ని తాండాలలో సంత శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ తాండాలో నూతనంగా నిర్మించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ మాత దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడంతో పాటు రాజకీయరంగంలోనూ రిజర్వేషన్లు కల్పించి పరిపాలనలో భాగస్వాములు చేసిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నియోజకవర్గంలోనూ గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాధవి రవి నాయక్, కిష్టారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.