దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే జిఎంఆర్

Districts politics Telangana

నినాదాలతో దద్దరిల్లిన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్

పటాన్చెరు

ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరేలా చూడాల్సిన గురుతర బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, సర్కిల్ పార్టీ నూతన కార్యవర్గాన్ని సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టడం జరిగిందన్నారు.

వార్డు స్థాయి నుండి పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం అయిందన్నారు. వచ్చే రెండు సంవత్సరాలు పరీక్షా సమయమని, ప్రతి కార్యకర్త సైనికుడి వలె కృషి చేయాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు వీటిని అందించడంతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గానికి ఎంపి నిధులు అత్యధికంగా కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పార్టీ అని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల వలే కలిసిమెలిసి పార్టీ పటిష్టతకు పనిచేయాలని కోరారు. శాసనమండలి మాజీ చీఫ్ విప్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు చేసే పసలేని విమర్శలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని కోరారు. రాష్ట్రంలోని 93 శాతం మంది ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి కట్టే పనుల్లో కేవలం 50 శాతం మాత్రమే రాష్ట్రానికి కేటాయిస్తూ, మిగిలిన డబ్బులతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. ఇక నుండి ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని కోరారు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పదవులు దక్కని కార్యకర్తలు, నాయకులు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జిల్లా, రాష్ట్ర కమిటీ లో ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు కార్పొరేషన్ పదవుల్లోనూ అవకాశం కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడేనని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ పార్టీ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ పాలకమండలి ఛైర్మన్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *