పలు పోటీల విజేతలకు బహుమతులు
ఉత్తమ పనితీరుకు అవార్డుల ప్రదానం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఆతిథ్య విభాగం సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు అంతర్జాతీయ హౌస్ కీపర్స్ వారోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించింది. ప్రాంగణాన్ని పచ్చగా, పరిశుభ్రంగా, ప్రతిరోజూ స్వాగతించేలా చేసే వెలుగులోకి రాని హీరోలయిన హౌస్ కీపింగ్ సిబ్బంది అంకితభావం, కృషిని గుర్తించి, వారిని సముచిత రీతిలో సత్కరించింది.తరచుగా తెరవెనుక పనిచేసే హౌస్ కీపింగ్ నిపుణులు ప్రాంగణంలో నిజమైన సూపర్ హీరోలు. ఆయా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది.. ఇలా అందరూ వృద్ధిలోకి వచ్చే వాతావరణాన్ని సృష్టించడంలో వారు అలుపెరగని సేవలను అందిస్తుంటారు. గీతంలో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది అంకితభావం, నిత్యం ఓపికగా చేసే పనికి కొంత విరామం ఇచ్చి, ఒక మధుర జ్జాపకంగా నిలిచేలా ఈ వారోత్సవాలు పనిచేశాయి.ఈ సందర్భాన్ని గుర్తుంచుకోవడానికి, హౌస్ కీపింగ్ సిబ్బందిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆకర్షణీయమైన పోటీలు, థీమ్ ఆధారిత సవాళ్లను నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, ఇన్ అండ్ అవుట్, బకెట్ బాల్, బిస్కెట్ బాల్, వాటర్ రీఫిల్లింగ్, బెలూన్ బ్రేకింగ్, పేపర్ కప్, బెడ్ మేకింగ్ పోటీలు వంటి సరదా కార్యకలాపాలు ఈ వేడుకలకు మరింత వన్నె తేవడంతో పాటు, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసి, ఇతరులతో స్నేహ భావాన్ని పెంపొందించాయి.సేవా మైలురాళ్ళు, సంవత్సరాల అంకితభావం, అత్యుత్తమ సహకారాలను గుర్తించే అవార్డుల ప్రదానోత్సవంతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. అసాధారణ సేవలను అందించిన వారికి ‘ఈ యేడాది ఉత్తమ పనితీరు కనబరచినవారు’ పేరిట ప్రత్యేక అవార్డులను కూడా ప్రదానం చేశారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ విజేతలను సత్కరించడంతో పాటు హౌస్ కీపింగ్ బృంద పనితీరు, అవిశ్రాంత కృషిని బహుదా ప్రశంసించారు.