మిస్ వరల్డ్ పోటీల‌కు అతిథ్య‌మివ్వ‌డం తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం

Hyderabad Lifestyle Telangana

తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే సువ‌ర్ణావ‌కాశం

అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలి

రాజకీయ కోణంలో మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదు

మిస్ వ‌ర‌ల్డ్ ప్రి ఈవెంట్ లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 72వ మిస్ వరల్డ్ పోటీల‌కు తెలంగాణ ఆతిధ్యం ఇవ్వ‌డం ఆనందంగా ఉంద‌ని, ప్యూచ‌ర్ సిటిగా ఎదుగుతున్న విశ్వనగరం హైద‌రాబాద్ ఈవెంట్ కు వేదిక‌గా నిల‌వ‌డం గ‌ర్వంగా ఉందని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ రెడ్డి, భాషా, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ‌ తదితరులు పాల్గొన్నారు. అతిధుల‌కు వేద మంత్రాల‌తో పూర్ణ‌కుంభం స్వాగతం ప‌లికారు. అనంత‌రం విగ్నేశ్వ‌ర పూజ చేసి, అతిధులంద‌రికి వేదాశీర్వ‌చ‌నం చేశారు.ప్రారంభంలో పేరిణి నాట్య క‌ళాకారుల‌తో హ‌రతినిచ్చి, తిల‌క‌ధార‌ణతో ప‌లికిన ఆహ్వానం అందరిని ఆక‌ట్టుకుంది. ఫిలిగ్రి వెండి వ‌స్తువులు, చేర్యాల న‌ఖాషి చిత్రాలను క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌సిద్ధిగాంచిన పోచంప‌ల్లి చేనేత ప‌ట్టు వ‌స్త్రాల‌ను అక్క‌డిక్క‌డే మ‌గ్గంపై నేసి చూపించడం అంత‌ర్జాతీయ మీడియాకు అద‌న‌పు ఆకర్శ‌ణ‌గా నిలిచింది. తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ వెబ్ సైట్ ను ఈ సంద‌ర్బంగా ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నెలవని, ప్ర‌పంచానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యటక అందాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చిందని, తెలంగాణ జాన‌ప‌ద క‌ళ‌ల‌ను తెలియ‌జేయ‌డం, చారిత్ర‌క‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాలు, ప్ర‌సిద్ధ దేవాల‌యాలు, ప్ర‌కృతి ర‌మణీయ ప్ర‌దేశాలను ద‌ర్శించేలా చేయ‌డంతో పాటు తెలంగాణ, హైద‌రాబాద్ రుచుల‌ను ప‌రిచ‌యం చేసేందుకు ఇదో అద్బుత‌ అవ‌కాశంగా భావిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను తెలంగాణ సంస్కృతి సొగ‌సులు అద్దెలా, భార‌తీయ వార‌సత్వ మూలాలోనే వీటిని నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల నిర్వ‌హ‌ణ చరిత్రాత్మకమ‌ని, వేలాది ఏళ్ల చ‌రిత్ర ఉన్న కొత్త రాష్ట్రంలో కొత్త కార్యక్రమం జరుగుతోందని, మహిళల ఆత్మ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశమ‌ని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదని వెల్ల‌డించారు. దక్షిణ కొరియాలో స్క్విడ్ గేమ్, బీటీఎస్ బ్యాండ్ లాంటివి ఆ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని, ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగానూ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమ‌ని, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలి. ప్రభుత్వంపై విమర్శలకు, రాజకీయ కోణంలోనే మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదని హిత‌వు ప‌లికారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సాధారణంగా ఆతిధ్య రాష్ట్రంతో 50-50 భాగస్వామ్య నమూనాను అనుసరిస్తుందని, ఈ పోటీల‌కు రూ. 55 కోట్లు అంచ‌నా వ్య‌యం కాగా
రూ. 27 కోట్ల రాష్ట్ర ప్ర‌భుత్వం భరించాల్సి ఉంది, మిగిలిన స‌గం నిధుల‌ను నిర్వ‌హ‌కులు స‌మకూరుస్తార‌ని, అయితే ఈ ఈవెంట్ లో స్పాన్స‌ర్స్ ను భాగ‌స్వాములు చేస్తున్నందు వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం ప‌డ‌ద‌ని, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ రూ. 5 కోట్లు మాత్ర‌మే వెచ్చిస్తుంద‌ని, మిగితా నిధులు స్పాన‌ర్స్ నుంచి స‌మ‌కూరుతాయ‌ని వివ‌రించారు.మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించవచ్చని తెలిపారు. సుమారు 140 దేశాల వారు ఇక్కడికి వస్తారని ప్రపంచం దృష్టి తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని వివరించారు. అందాల పోటీలు అంటే ఇంకో కోణంలో చూడొద్దని ఇది ఎంతో మంది అమ్మాయిలకు, మహిళలకు, మనోధైర్యం, సంకల్పం ఇస్తుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

నమస్తే ఇండియా అంటూ 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పలకరించింది. అతిథులు చాలా గొప్పగా స్వాగతం చెప్పారని అన్నారు. తన ప్రయాణంలో, తన హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. భారత కల్చర్, ఆర్ట్స్ చాలా గొప్పగా ఉంటాయని వివరించారు. భారతదేశం చాలా ఇన్‌స్పైరింగ్ అని అన్నారు. భారత్ విలువలను బోధిస్తుందని.. భిన్నత్వంలో ఏకత్వానికి ఎంతో గొప్ప భావన ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నో భాషలు ఉన్నా అంత ఒక్కటిగా ఉండటం భారతదేశం స్ఫూర్తి అని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలు కూడా అంతే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పారు.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచి అనుభూతిని ఇచ్చిందని, ఈ జ‌ర్నీ త‌న‌కు ఎప్పటికీ గుర్తుండి పోతుంద‌ని క్రిస్టినా పిజ్కోవా పేర్కొన్నారు.

తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యతను క‌లిగి ఉంద‌ని ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ తెలిపారు. ఈ ప్రాంతానికి వేలాది ఏళ్ల చరిత్ర ఉందని ఉద్ఘాటించారు. యునెస్కో గుర్తింపు పొందిన‌ రామప్ప, వేయి స్థంభాల గుడి, గోల్కొండ, కాక‌తీయ కోట‌లు, చార్మినార్ లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. మే నెలలో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి ప్రతిభింభించేలా నిర్వహించనున్నామని చెప్పారు. మెడికల్ టూరిజంలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. సినిమా, ఆహార రంగాల్లో తెలంగాణకు పెట్టింది పేరని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *