హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!

Hyderabad
హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!
  • సడన్ గా లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల కార్మికులు ఎలా వెళ్తారు?
  • వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది
  • సాయంత్రం వేళల్లో ఏమైనా సడలింపులు ఉంటాయా?
తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాసేపట్లో లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయనుంది. మరోవైపు హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారిగా రేపటి నుంచి లాక్ డౌన్ అని ప్రకటిస్తే… ఇంత తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థలాలకు ఎలా వెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది.

గత ఏడాది లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి అలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రోజువారీ కూలీ చేసుకుంటూ బతుకుతున్న వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటికే 50 శాతం మంది వలస కార్మికులు వాళ్ల సొంతూళ్లకు వెళ్లిపోయారని కోర్టుకు ఏజీ తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో సాయంత్రం వేళల్లో ఏమైనా సడలింపులు ఉంటాయా? అనే హైకోర్టు ప్రశ్నకు బదులుగా… ఎలాంటి సడలింపులు ఉండవని ఏజీ చెప్పారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై వివరాలను తెలపడానికి మూడు రోజుల సమయం కావాలని కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఈలోగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాలా? అని ప్రశ్నించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *