గీతంలో ఘనంగా ప్రారంభమైన ‘గస్టో’

Telangana

లాంఛనంగా ప్రారంభించిన ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీ

ఉత్సాహంగా పాల్గొంటున్న పలు కళాశాలల జట్లు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ‘గస్టో-2025’ పేరిట నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా పోటీలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఈ ఉత్సాహ భరితమైన క్రీడాతత్వం, జట్టు కృషి, పోటీ స్ఫూర్తి గీతం చుట్టుపక్కల ఉన్న ఔత్సాహిక క్రీడాకారులందరినీ ఒకచోటకు చేర్చింది.ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత, భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన చేసి, గస్టో-2025 క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలో, షబ్బీర్ అలీ, క్రీడల పట్ల గీతం నిబద్ధతపై ప్రశంసలను కురిపించారు. ‘నేను గస్టో గురించి చూసినప్పుడు, క్రీడా పోటీల నిర్వహణ కోసం గీతం పలు కమిటీలను నియమించడం చూసి ఆశ్చర్యపోయాను. ఇన్ని కమిటీలను వేయడం మరెక్కడా చూడలేదు. ఈ పోటీల నిర్వహణ కోసం నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలు నిజంగా ప్రశంసనీయం. ఈ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలకే కాకుండా, వారు చదివే విద్యా సంస్థలు, దేశానికి కూడా అవార్డులు తెస్తారని నేను విశ్వసిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. క్రీడలలో తన ప్రయాణం తన జీవితాన్ని తీర్చిదిద్దిందని చెప్పిన అలీ, ఆయా పోటీలలో పాల్గొనే వారందరూ తమ ఉత్తమమైన ప్రతిభను ప్రదర్శించాలని ప్రోత్సహించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పోటీతత్వాలను కొనసాగిస్తూ, గొప్ప విజయాలను అందుకోవాలని షబ్బీర్ అలీ అభిలషించారు.

కాగా, ముఖ్య అతిథి షబ్బీర్ అలీని గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణ రావు చౌదరి తదితరులు దుశ్శాలువ, జ్జాపికలతో సత్కరించారు.షబ్బీర్ అలీ వంటి విశిష్ట అతిథి గస్టో ప్రారంభోత్సవంలో పాల్గొనడం ముదావహమని డీవీవీఎస్ఆర్ వర్మ అన్నారు. మండుతున్న ఎండను కూడా లెక్క చేయకుండా పోటీలలో గెలుపొందాలనే స్ఫూర్తితో గత కొంత కాలంగా క్రీడా మైదానంలో సాధన చేస్తున్న క్రీడాకారులను ఆయన అభినందిస్తూ, వారు భవిష్యత్తు ఛాంపియన్లుగా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

గస్టోలో భాగంగా, క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, త్రోబాల్, చెస్, పవర్ లిఫ్టింగ్, బాస్కెట్ బాల్ వంటి ఉత్తేజకరమైన క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు సిద్ధార్థ, ఎంజీఐటీ, ఎంఎల్ఆర్డీ, భవన్స్, లయోలా అకాడమీ, మహీంద్రా, నిక్ మర్, కేఎల్ యూ, వీఎన్ఆర్ వీజేఐఈటీ, గీతం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకుని, ఆయా పోటీలలో తమ ప్రతిభను పరీక్షించుకుంటున్నారు.

తొలుత, విద్యార్థిని శ్రావ్య ఆలపించిన గణేష వందనం; శరణ్య, మంజూష, తరుణి, గాయత్రి, మాన్వితల మంత్ర ముగ్ధులను చేసే శాస్త్రీయ నృత్యంతో గస్టో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. ఉత్సాహం, స్నేహభావం, అవిశ్రాంత దృఢ సంకల్పంతో యువ అథ్లెట్లు తమ ఐక్యత, నైపుణ్యాలను ఆయా క్రీడా పోటీలలో ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *