ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా
ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు.ఆదివారం పటాన్ చెరు పట్టణంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అమలు కావడం లేదని,వికలాంగుల సంక్షేమం, నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు చెప్పారు.
గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు .జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న జీవో నెం 34 అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను కొత్తగా నియమించడం జరిగిందని, వికలాంగుల సంక్షేమ శాఖను అవసరమైన ఉద్యోగులను నియమించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేయ లేదన్నారు.వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గత ప్రభుత్వ హయాంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, పోరాటాలకు తలోగ్గి తెరాస ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు .రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెం 34 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
