అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 15వ రోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వాణి నగర్ లో నూతన బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ మున్సిపాలిటీలో కోట్ల రూపాయలతో శర వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. 250 పైగా కాలనీలతో విస్తరించి ఉన్న మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక అబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రక్షిత మంచినీరు, పచ్చదనం తదితర కార్యక్రమాలకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వెయ్యకుండా చర్యలు తీసుకోవడంతోపాటు తడి పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నేరుగా ప్రజలతో చర్చించి పనుల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.
బస్తీల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి దవాఖానాలో వైద్యుడితోపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతోపాటు, 54 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.