విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – సినీనటుడు తనికెళ్ళ భరణి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సినీనటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు పెద్దలు రెండో స్థానాన్ని ఇచ్చారని చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవాలని హితవు పలికారు .ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, తెలంగాణ & ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ వేడుక విజయాలను గుర్తించడమే కాకుండా ఉత్సాహంతో జరుపుకునే ఒక ప్రయాణం అన్నారు. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో, స్ఫూర్తిని నింపడంలో ముందుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేస్తున్నారన్నారు. వాళ్ల అచంచలమైన నిబద్ధత మా విజయానికి మూలస్తంభం అన్నారు.
రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రేరణ, సంరక్షణ అనేవి కేవలం సంచలన పదాలు మాత్రమే కాదని, అవి మా విధానంలో అంతర్భాగాలని తెలిపారు. విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ‘మీలో ప్రతి ఒక్కరూ మన గొప్ప కథలో ఓ అంతర్భాగం, ఈ ఆనందోత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దాం. ఈ అద్భుత ప్రయాణంలో మీరు ఓ ముఖ్యమైన భాగమైందందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని తెలిపారు.’రెసో దర్పణ్’లో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ తెలంగాణ అకడమిక్ డీన్ విద్యాసాగర్, మార్కెటింగ్ మేనేజర్ మార్కండేయులు, జనరల్ మేనేజర్ మల్లేశ్, జోనల్ ఇన్‌ఛార్జ్ వాణి, ప్రిన్సిపాల్ రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు, 1200 విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.